ప్రియుడితో వధువు జంప్‌.. పరువు కోసం చెల్లితో వివాహం.. అంతలోనే మరో ట్విస్ట్‌!

అతిరథమహారధులు, బంధువులతో పెళ్లి పందిట్లో కోలాహలంగా ఉంది. కోమరికొద్ది గంటల్లో మూడు ముళ్లు పడి ఓ ఇంటికి కోడలిగా వెళ్లాల్సిన పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కు ట్విస్ట్‌ ఇచ్చింది. విషయం తెలిసి పెళ్లి కొడుకు తరుఫు వారు, పెళ్లికొచ్చిన వారు అవాక్కయ్యారు. అయితే కొద్ది సేపటికే అన్నీ సర్దుకొని అనుకున్న సమయానికి పెళ్లి తంతు ముగించారు. ఇంతకీ ఆ పెళ్లి కూతురు ఏం ట్విస్ట్‌ ఇచ్చిందో అనుకుంటున్నారా? పెళ్లి సమయానికి పెళ్లి కూతరు ప్రియుడితో జంప్‌ అయిన సంఘటనలు మనం ఎక్కువగా సినిమాల్లోనో.. సీరియళ్లలోనో చూస్తుంటాం. ఇక్కడ ఈ యువతి చేసిన ఘనకార్యం ఇదే. కానీ పరువు పోకూడదని వరుడికి ఆమె చెల్లెలినిచ్చి పెళ్లి చేశారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని కలహండీ జిల్లా మాల్పాడా గ్రామానికి చెందిన ఓ అమ్మాయికి, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నారు ఇరు పక్షాల వాళ్లు. తీరా ముహూర్త సమయం రానే వచ్చింది. మరికొద్ది సేపట్లో పెళ్లి తంతు జరగాల్సి ఉండగా.. వధువు తాను ప్రేమించిన వ్యక్తితో జంప్‌ అయ్యింది. దీంతో తమ పరువు గంగలో కలిసిపోతుందని, వధువు చెల్లితో అయినా సరే పెళ్లి జరిపించాలని అబ్బాయి తరుపు వాళ్లు పట్టుబట్టారు. దీంతో గత్యంతరం లేక అమ్మాయి తల్లిదండ్రులు ఇందుకు అంగీకరించారు. గండం గట్టెక్కి అమ్మాయిని ఆనందంగా తన ఇంటికి తీసుకెళ్లారు. అయితే పెళ్లి కుమార్తె వయస్సు 15 ఏళ్లే కావడంతో ఇది బాల్య వివాహం కిందకు వస్తుందని, చట్టారీత్యా నేరమంటూ అధికారులు మరో షాకిచ్చారు. బాలికకు 18 ఏళ్లు వచ్చేదాకా అత్తారింటికి పంపొద్దని చెప్పడంతో ఇరు పక్షాల వారు అంగీకరించారు. బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించిన అనంతరం ఇరు కుటుంబాలకు అధికారులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *