మానవ అక్రమ రవాణాను అరికట్టాలి

  

జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి    

విశాఖపట్నం :- మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్వతంత్ర సేవాసమితి ఆధ్వర్యంలో నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ప్లకార్డులను, గోడ పత్రికలను జివిఎంసి  ప్రధాన కార్యాలయంలో ఆమె ఛాంబర్లో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిందని ఆందోళన చెందారు. అక్రమ రవాణా దారులకు ఇది చాలా లాభసాటి వ్యాపారం అని ప్రజల్లో అవగాహన లేనందున ముఖ్యంగా పేదరికం, లింగ వివక్షత,  మూఢాచారాలు సాంఘిక దురాచారాలు, ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని కొంతమంది అక్రమ రవాణా దారుల ఇటువంటి వాటికి పాల్పడుతున్నారని తెలిపారు. వీరిలో ఎక్కువగా స్త్రీలు, పిల్లలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి మానవ అక్రమ రవాణాను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలపై ఉందని, దీనిపై అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్మూలించుటకు ఎంతో కృషి చేస్తున్నారని, మహిళలు ఆర్థికంగా నిలబడేందుకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి అభ్యుదయానికి కృషి చేస్తున్నారని తెలిపారు. కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ అక్రమ రవాణాను అరికట్టేందుకు “మానవ అక్రమ రవాణా బిల్లు-2021” ను ప్రవేశపెట్టిందని మేయర్ తెలిపారు. విశాఖ ఎన్.జి.ఒ.   ఫారం చైర్మన్ నరవ ప్రకాశరావు మాట్లాడుతూ కోవిడ్-19 సమయంలో ఇటువంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అందువలన మానవ అక్రమ రవాణా నిరోధం, సంరక్షణ మరియు పునరావాసంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో స్వతంత్ర సేవా సమితి సభ్యులు డా. ప్రమీల పీటర్, డా. ప్రజ్ఞ కుమార్,  జివిఎంసి  కార్పొరేటర్లు బర్కత్ అలీ, ఊరుకూటి నారాయణ రావు, కందుల నాగరాజు, వంశీకృష్ణ యాదవ్, సాధిక్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed