కుటుంబ సమేతంగా మంత్రి కొడాలి నాని – అనుపమ దంపతుల పూజలు

– సంపూర్ణంగా శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం
– యలమర్రులో 26 న ఏకకాల ప్రతిష్ఠా మహోత్సవాలు
– కోవిడ్ -19 నేపథ్యంలో ప్రత్యేక నియమాలతో సేవలు
– అత్యంత వైభవంగా పంచగవ్యాధివాసం, జలాధివాసం
గుడివాడ : కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న ఏకకాల ఆలయ, శిఖర, ధ్వజ, విగ్రహ ప్రతిష్యా మహోత్సవాల్లో భాగంగా గురువారం రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)- అనుపమ దంపతులు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. గర్భాలయం, అంతరాలయం, ముఖ మండపం, గరుడాళ్వార్, ధ్వజ స్థంభం, శక్తి పీఠంలతో సంపూర్ణ శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయంగా మంత్రి కొడాలి నాని కుటుంబీకులు నిర్మించారు. ప్రతిష్ఠా మహోత్సవాల్లో భాగంగా యాజ్జీక బ్రహ్మ శ్రీమాన్ చలమచర్ల మురళీకృష్ణమాచార్యులు, ఆలయ స్థపతి పెద్దిరెడ్డి సతీష్, 16 మంది రుత్విక్ లు పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మంత్రి కొడాలి నాని – అనుపమ దంపతులు, కుమార్తెలు కనకదుర్గ, విజయదుర్గ, అత్తమామలు యలమంచిలి సాయేశ్వరరావు – చంద్రావతి, వారి కుమారుడు – కోడలు యలమంచిలి వంశీకృష్ణ – సౌజన్య, కుమార్తెలు స్వాతి, భావన, యార్లగడ్డ సత్యనారాయణలతో పంచగవ్యాధివాసం పూజలను జరిపించారు. ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రం, గోమయంలతో విగ్రహాలను శుద్ధి చేశారు. అనంతరం జలాధివాసం పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ నెల 25 వ తేదీ ఉదయం పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. సాయంత్రం ఐదు రకాల ధాన్యాలతో పంచశయ్యాధివాసం పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం షోడశ కళాన్యాసం జరుగుతుంది. 26 వ తేదీ ఉదయం 10.45 గంటలకు ఏకకాల ప్రతిష్ఠలను నిర్వహిస్తారు. విగ్రహ ప్రతిష్టా మహోత్సవాల్లో భాగంగా చతుష్టానార్చనలు, పరివార దేవతలకు పూజలను వైభవో పేతంగా జరుపుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నియమాలతో, ఏకాంతంగా సేవలు జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed