శేషాద్రి కొండపై కొలువుదీరిన ప్రసిద్ధ దేవాలయం చిన్నతిరుపతి

– ద్వారకా తిరుమలపై శ్రీద్వారకాధీశ నమోనమ: గ్రంథం
– మాటూరిని అభినందించిన మంత్రి కొడాలి నాని
గుడివాడ : శేషాద్రి కొండపై కొలువు దీరిన సుదర్శన క్షేత్రం ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందినదని, ఈ ఆలయంపై శ్రీద్వారకాధీశ నమోనమ: గ్రంథాన్ని రచించడం అభినందనీయమని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని ఇంటి దగ్గర మంత్రి కొడాలి నానిని ప్రముఖ వ్యాపారవేత్త, రచయిత మాటూరి రంగనాథ్ కలిశారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామిపై రాసిన శ్రీ ద్వారకాధీశ నమోనమ: గ్రంథాన్ని మంత్రి కొడాలి నానికి అందజేశారు. స్వామివారి అనుగ్రహం, మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ సహకారం వల్ల తన భార్య డాక్టర్ మాటూరి శ్రీవల్లి ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా కొనసాగుతోందని రంగనాథ్ చెప్పారు. శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం గురించి సవివరంగా భక్తులకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో గ్రంథాన్ని రచించడం జరిగిందన్నారు. ఈ పుస్తకంలో దత్త దేవాలయాలు, వేద పాఠశాల, డిగ్రీ కళాశాల, గోశాలతో పాటు ఆలయంలో జరిగే క్రతువులు, అన్నదానం వంటి విషయాలను పొందుపర్చానని చెప్పారు. అనంతరం శ్రీద్వారకాధీశ నమోనమః గ్రంథాన్ని మంత్రి కొడాలి నాని ఆసక్తిగా చదివారు. ద్వారకా తిరుమలలోని శేషాద్రి కొండపై శ్రీవేంకటేశ్వర స్వామి కొలువు తీరి ఉన్నారని, స్వామివారిపై గ్రంథాన్ని రాయడం ఎంతో అదృష్టమని మంత్రి కొడాలి నాని అన్నారు. ఈ గ్రంథంలో నిత్య కార్యక్రమాలు, విశేష ఉత్సవాలు, ఇతర ఆలయాలు, చూడదగిన ప్రదేశాలను చక్కగా వివరించారని తెలిపారు. గ్రంథకర్త మాటూరిని మంత్రి కొడాలి నాని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed