రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం జగన్మోహనరెడ్డి

 

– గుడివాడలో రూ. 2 కోట్లతో చెత్త తరలింపు స్టేషన్లు
– ప్రతి ఇంటికీ మూడు డస్ట్ బిన్లను అందజేస్తాం
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ : రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంపై సీఎం జగన్మోహనరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ రాజేంద్రనగర్లోని ఇంటి దగ్గర మంత్రి కొడాలి నాని క్లీన్ ఆంధ్రప్రదేశ్, టిడ్కో ఇళ్ళు, ఇళ్ళపట్టాల పంపిణీపై మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్ తో సమీక్షించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో ప్రతిరోజూ 50 టన్నుల చెత్తను మున్సిపాలిటీ సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలిస్తోందని చెప్పారు. వార్డుల్లో ఎక్కడా చెత్త నిల్వవుండకుండా ఎప్పటికపుడు సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశించారన్నారు. దీనిలో భాగంగా ఇంటింటికీ వెళ్ళి తడి, పొడి చెత్తలను సేకరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 8 వేల ఆటోమేటిక్ ట్రక్కులను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. గుడివాడ పట్టణానికి 40 ట్రక్కులు రానున్నాయని చెప్పారు. చెత్తను సేకరించే ప్రతి ట్రక్కుకు జీపీఎస్, కెమెరా వంటివి ఏర్పాటు చేస్తారన్నారు. ప్రతి ఇంటికీ మూడు డస్ట్ బిన్లను ఉచితంగా అందజేస్తున్నామని, ఇందు కోసం రూ. 75 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. సేకరించిన చెత్తను పట్టణంలోని నాలుగు ప్రాంతాల్లో రూ. 2 కోట్లతో ఏర్పాటు చేసే చెత్త తరలింపు స్టేషన్లకు తరలిస్తామన్నారు. అక్కడ తడి, పొడి చెత్తలను వేరు చేసేందుకు, విక్రయించేందుకు కబాడీ వాలాలతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ట్రాన్స్ ఫర్ స్టేషన్లకు తరలించే చెత్తను కబాడీ వాలాలు తమ సిబ్బందితో వేరు చేస్తారని, పొడి చెత్తను ఎరువుగా, తడి చెత్తను కంపోస్ట్ తయారీకి వినియోగిస్తారని, వీటి ద్వారా మున్సిపాలిటీకి కొంత ఆదాయం కూడా సమకూరుతుందన్నారు. ఇప్పటి వరకు తడి, పొడి చెత్తలను వేరు చేసి వినియోగించుకోక పోవడం వల్ల నిత్యం టన్నుల కొద్దీ వ్యర్థాలను డంపింగ్ యార్డ్లో పడవేయాల్సి వస్తోందన్నారు. దీనివల్ల కాలుష్యం వంటి సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో తీసుకుంటున్న చర్యల వల్ల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పరిశు భ్రత, పారిశుద్ధ్యం మరింతగా మెరుగవుతాయని చెప్పారు. అలాగే గుడివాడ పట్టణంలో 8,912 మంది లబ్ధిదారులకు గుడివాడ రూరల్ మండలం మల్లాయిపాలెం పరిధిలో టీడ్కో గృహాలను నిర్మిస్తున్నామన్నారు. వీటిలో 500 గృహాలు ఖాళీగా ఉన్నాయని , కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఈ గృహాలను కేటాయిస్తామన్నారు. అలాగే పట్టణంలోని అర్హులైన పేదల కోసం 181 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని చెప్పారు. ఇక్కడ 7 వేల మందికి ఇళ్ళపట్టాలను అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 28.30 లక్షల ఇళ్ళను ప్రభుత్వం నిర్మిస్తోందని చెప్పారు. మొదటి దశలో 15.60 ఇళ్ళ నిర్మాణాన్ని ప్రారంభించి 2022 జూన్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో సీఎం జగన్మోహనరెడ్డి ఉన్నారని చెప్పారు. రెండవ దశలో చేపట్టే 12.70 లక్షల ఇళ్ళను 2023 జూన్ నాటికి పూర్తిచేస్తామన్నారు. రెండు దశల్లో ఇళ్ళ నిర్మాణాలకు రూ.50,944 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోందని మంత్రి కొడాలి నాని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed