ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ గోడౌన్ కూల్చివేత

 

విశాఖ: నగరంలోని మిందిలో ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ ఉన్న ప్రైవేట్ గోడౌన్‌ను రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు కూల్చివేశారు. అనుమతి లేని నిర్మాణాలని అధికారులు చెబుతున్నారు. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని గోడౌన్ యజమానులు అంటున్నారు. మిందిలో ఏపీఐఐసీకి చెందిన స్థలాన్ని గతంలో రాయుడు అనే వ్యక్తి నుంచి లీజుకు తీసుకున్నారు. అతని నుంచి అతని కుమారుడు అవినాష్ నుంచి కూడా ఆంధ్రజ్యోతి యాజమాన్యం లీజుకు తీసుకుంది. బుధవారం అధికారులు ఎవరిని లోపలకు అనుమతించకుండా కూల్చివేశారు.

అయితే ఏపీఐఐసీ అధికారులు ఎం చెబుతున్నారంటే.. ఈ స్థలం ప్రైవేటు వ్యక్తికి ఇచ్చామని, ఇక్కడున్నవన్నీ అనుమతిలేని కట్టడాలని చెప్పారు. కాగా ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించి దాదాపు ఐదేళ్లయింది. దీనికి సంబంధించి అన్ని అనుమతులు ప్రభుత్వం నుంచి ఆంధ్రజ్యోతి యాజమాన్యం తీసుకుంది. ఇక్కడ గోడౌన్ యాజమానితో రాజకీయపరమైన విబేధాలవల్లే కూలగొట్టినట్లు తెలుస్తోంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు అకస్మాతత్తుగా వచ్చి గోడౌన్‌ను కూల్చివేయడం రాజకీయ దురుద్దేశంగా అంతా భావిస్తున్నారు.

కాగా గోడలకు అధికారులు నోటీసులు పెట్టారు. ఒకటి 15-12-2020, ఇంకొకటి 25-2-2021న పెట్టినట్లు ఉంది. కానీ నాలుగు రోజుల క్రితమే విశాఖలో భారీ వర్షం కురిసింది. వర్షానికి నోటీసులు చెక్కుచెదరకుండా ఉన్నాయంటే.. ఈ నోటీసులు ఓ ప్లాన్ ప్రకారం తేదీలు వేసి గోడలకు అంటించినట్లుగా తెలుస్తోంది. అక్కడున్న స్థానికులు కూడా ఇదే విషయం చెప్పారు. మొన్న రాత్రి అధికారులు వచ్చి గోడలకు నోటీసులు అంటించి వెళ్లారని చెప్పారు. సమయం ఇవ్వాలని అధికారులను అడిగినా పట్టించుకోకుండా గోడౌన్‌ను కూల్చివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *