అమరావతి: సామాన్యుడి నడ్డి విరిచేలా రాయితీ గ్యాస్‌ సిలిండర్‌ ధరను చమురు సంస్థలు అమాంతం పెంచాయి. దీంతో వంటింట్లో గ్యాస్‌ బండ సామాన్యులకు మోయలేని భారంగా మారుతోంది. ఒక్కో సిలిండర్‌పై ఈ నెల 4వ తేదీన రూ.25, 15న రూ.50 పెంచగా ప్రస్తుతం మరో రూ.25 ధర పెంచాయి. ఒకే నెలలో సుమారు రూ.100 వరకు ధర పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గృహ వినియోగ సిలిండర్‌ (14.2 కేజీల) ధర ప్రస్తుతం విజయవాడలో రూ.816.50, ఒంగోలులో రూ.839.50, కందుకూరులో రూ.841.50కు (రవాణా చార్జీల వల్ల వ్యత్యాసం) పెరిగింది. భవిష్యత్తులో ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

సబ్సిడీలోనూ భారీ కోత 
వినియోగదారులకు కేంద్రం ఇచ్చే సబ్సిడీలోనూ భారీగా కోత విధించారు. ఒక్కో సిలిండర్‌పై గత ఏడాది రూ.220 చొప్పున సబ్సిడీ మొత్తం వినియోగదారుల బ్యాంకు అకౌంట్‌కు జమ అయ్యేది. ప్రస్తుతం సబ్సిడీ మొత్తం కేవలం రూ.15.38 మాత్రమే జమ చేస్తున్నారు. రాష్ట్రంలో వినియోగదారులకు ప్రతి రోజూ సగటున రెండు లక్షలకు పైగా సిలిండర్లు డెలివరీ చేస్తున్నారు. గతంలో రోజూ సబ్సిడీ మొత్తం రూ.4.50 కోట్లు వినియోగదారులకు అందుతుండేది. ప్రస్తుతం ఆ మొత్తం కేవలం రూ.30.76 లక్షలకు మాత్రమే పరిమితమైంది. మున్ముందు సబ్సిడీ పూర్తిగా ఎత్తేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా, గ్యాస్‌ ధర పెంపుపై సామాన్యులు పెదవి విరుస్తున్నారు.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *