ఆలయ ఘటనల్లో అలక్ష్యం వద్దు

అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న ఆలయ ఘటనల పట్ల ఏ మాత్రం అలక్ష్యం వహించవద్దని, అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తూ వాటిని ఛేదించి మత సామరస్యాన్ని కాపాడాలని డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళగిరి పోలీస్‌ ప్రధాన కార్యాలయం నుంచి మంగళవారం ఆయన జిల్లాల ఎస్పీలు, కమిషనర్‌లతో వెబినార్‌ నిర్వహించారు. రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన ఘటనలపై కేసుల నమోదు, దర్యాప్తు, నిందితుల అరెస్టులతోపాటు గ్రామ రక్షణ దళాల (విలేజ్‌ డిఫెన్స్‌ స్క్వాడ్స్‌) ఏర్పాటుపై సమీక్షించారు. శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్, సిట్‌ చీఫ్‌ జీవీజీ అశోక్‌కుమార్‌ తదితర ఐపీఎస్‌ అధికారులతో కలిసి ఆలయాల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పథకం ప్రకారం జరిగే ఆలయ విధ్వంస ఘటనలకు అడ్డుకట్ట వేసేలా సమన్వయంతో పని చేయాలన్నారు. ఆలయాలపై దాడుల్లో రాజకీయ దురుద్ధేశాలు బయట పడుతున్నందున, ఆయా ఘటనల్లో రాజకీయ ప్రమేయాన్ని ఏ మాత్రం ఉపేక్షించవద్దన్నారు. సమాజంలో దేవుడి సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని అలజడి రేపి, రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసే వారిని ఆధారాలతో సహా గుర్తించి ప్రజలకు తెలియజెప్పాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *