ప్రయాణికులపై ‘ప్రైవేట్’‌ బాదుడు

అమరావతి: ఎప్పటిలాగే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యజమానులు ఈ పండుగ సీజన్‌లోనూ దోపిడీకి తెగబడ్డారు. సంక్రాంతికి సొంతూరుకు వెళ్దామనుకునే వారికి రెండ్రోజులుగా చార్జీలు పెంచి చుక్కలు చూపిస్తున్నారు. డిమాండ్‌ ఉన్న తేదీల్లో అయితే మరీ బాదేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి ఆర్టీసీ టికెట్‌ ధర రూ.900 ఉంటే, ప్రైవేటు ట్రావెల్స్‌లో మాత్రం రూ.1,500 వరకు వసూలుచేస్తున్నారు. ఆర్టీసీ ఏసీ బస్సుల్లో హైదరాబాద్‌నుంచి గుంటూరుకు రెగ్యులర్‌ సర్వీసుల్లో రూ.530 వరకు ఉంది. అదే స్పెషల్‌ బస్సు అయితే రూ.795 వసూలుచేస్తున్నారు. కానీ, ప్రైవేటు బస్సులో ఏకంగా రూ.1,130–1,200 వరకు తీసుకుంటున్నట్లు ఆన్‌లైన్‌లో ఉంచారు. నాన్‌ ఏసీ ఆర్టీసీ బస్సుల్లో ఇదే మార్గంలో రెగ్యులర్‌ సర్వీసులకు రూ.418 అయితే, స్పెషల్‌ బస్సుల్లో రూ.568 వసూలుచేస్తున్నారు. ప్రైవేటు బస్సుల్లో నాన్‌ ఏసీ టికెట్ల ధరలు రూ.850–రూ.950 వరకు ఉన్నాయి.  టికెట్‌ రిజర్వేషన్లు చేసే రెడ్‌బస్, అభీబస్‌ల నిర్వాహకులతో ఇప్పటికే మాట్లాడాం. ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టినా.. అధిక రేట్లకు విక్రయించినా.. ట్రావెల్స్‌ నిర్వాహకులపైనే కాదు.. బస్‌ టికెట్‌ కంపెనీలపై కూడా కేసులు నమోదు చెయ్యొచ్చు. నేటి నుంచి తనిఖీలు ముమ్మరం చేస్తాం. ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు తమ బస్సుల్లో ‘రవాణా అధికారులు ఎక్కడైనా తనిఖీలు చేస్తారు.. వారికి సహకరించాలి’ అని బోర్డులు పెట్టుకోవాలి.

ప్రైవేట్‌ దోపిడీపై రవాణా శాఖ కన్ను 
ఇలా ప్రయాణికుల్ని దోచుకుంటున్న ప్రైవేటు ట్రావెల్స్, టికెట్‌ బుకింగ్‌ వెబ్‌సైట్లపై రవాణా అధికారులు దృష్టిసారించారు. మోటారు వెహికల్‌ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేయనున్నారు. అంతేకాక.. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందితే భారీ జరిమానాలు విధించనున్నారు. సంక్రాంతి పండుగ సీజన్‌ మొదలుకావడంతో రాష్ట్ర సరిహద్దుల్లోనే ప్రైవేటు బస్సులను తనిఖీలు చేసేందుకు జిల్లాల వారీగా బృందాలను ఏర్పాటుచేశారు. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించినా తీరు మార్చుకోకపోతే వాటిని సీజ్‌ చేయనున్నారు. అలాంటి ట్రావెల్స్‌ నిర్వాహకులకు రూ.25 వేల వరకు జరిమానాలు విధించనున్నారు. కేసులు నమోదు చేసిన ట్రావెల్స్‌ వివరాలను అన్ని చెక్‌పోస్టులకు పంపించాలని కమిషనరేట్‌ అధికారులు సూచించారు. ఇతర రాష్ట్రాల బస్సులకు సైతం కేసుల నమోదు విషయంలో మినహాయింపులేదని రవాణా శాఖాధికారులు స్పష్టంచేశారు. మరోవైపు.. టికెట్ల ధరలు తగ్గిస్తామని రవాణా శాఖ మంత్రి పేర్ని నానికి ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు గతేడాది హామీ ఇచ్చినప్పటికీ ఈ ఏడాది కూడా అధికంగానే వసూలుచేయడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *