తొలి దశలో 3,87,983 మందికి వ్యాక్సిన్

అమరావతి: కోవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియ దగ్గర పడుతున్న కొద్దీ ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తమవుతోంది. తొలిదశ వ్యాక్సిన్‌ ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖతో పాటు రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్‌ తదితర శాఖలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటివరకు రిజిస్టర్‌ అయిన ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ అందరికీ వ్యాక్సిన్‌ వేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నాటికి 3,87,983 మంది హెల్త్‌కేర్‌ వర్కర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి వ్యాక్సినేషన్‌ ప్రదేశాలను గుర్తించారు. వందమంది పనిచేసే ఏ ఆస్పత్రిలోనైనా సరే అది ప్రైవేటు ఆస్పత్రి అయినా అక్కడ ఒక వ్యాక్సినేషన్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ ఆదేశించింది. ఈనెల 15వ తేదీకి ముందే రాష్ట్రానికి వ్యాక్సిన్‌ చేరుతుందని, 16న వ్యాక్సిన్‌ వేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు చెప్పారు. కో–విన్‌ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు కుటుంబ సంక్షేమశాఖ అధికారులు తెలిపారు. రెండోదశలో వ్యాక్సిన్‌ వేయించుకునే వారు ఈనెల 25వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *