రాష్ట్రమంతా ఒకే నమూనా సర్వే రాళ్లు

                                                                   ప్రతీకాత్మక చిత్రం

అమరావతి: సర్వే రాళ్లు ఎక్కడున్నాయో తెలుసుకోవడం ఇప్పుడు పెద్ద చిక్కు. ఇది సర్వే రాయా, కాదా అని తెలుసుకోవాలంటే దాన్ని పెకలించి చూడాల్సిందే. ఇది ప్రస్తుతం ఉన్న సమస్య. సమగ్ర రీసర్వే తర్వాత ఇలాంటి అనుమానాలకు ఆస్కారమే ఉండదు. సర్వే అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా నాటే సర్వే రాళ్లన్నీ ఒకే నమూనాలో ఉంటాయి. ట్రైజంక్షన్లలో పెద్దవి, సర్వే నంబర్ల మధ్య చిన్నవి పాతుతారు. వీటిపై ‘వైఎస్సార్‌ జగనన్న భూరక్ష –2020’ అనే అక్షరాలు ఉంటాయి. ఈ రాయిని చూస్తేనే ఇది 2020లో జరిగిన రీసర్వే సందర్భంగా నాటిన సర్వే రాయి అని తెలుస్తుంది. సర్వే రాళ్లను గుర్తించడానికి ఎలాంటి చిక్కులు ఉండకుండా ఒకే నమూనా రాళ్లు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా చేయడంవల్ల ఒకవేళ ఎక్కడైనా సర్వే రాళ్లు పడిపోయినా సులభంగా గుర్తించడానికి వీలవుతుంది. ప్రతి సర్వే రాయిని జియో ట్యాగింగ్‌ చేస్తారు. దీంతో ఎవరైనా ఈ రాళ్లను పీకేసినా ఇది ఎక్కడ ఉండాల్సిందో సులభంగా గుర్తించవచ్చు. మొదటి విడత సర్వే చేయనున్న 5,500 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి 17,461 ‘ఎ’ క్లాస్‌ సర్వే రాళ్లు, 50 లక్షల ‘బి’ క్లాస్‌ సర్వే రాళ్లు అవసరమని సర్వే సెటిల్‌మెంట్‌ విభాగం లెక్కకట్టింది. ఈమేరకు రాళ్లను వచ్చే నెల ఒకటో తేదీ నాటికి సేకరించాలని ప్రభుత్వం సర్వే సెటిల్‌మెంట్‌ శాఖను ఆదేశించింది. భూగర్భ గనులశాఖ సహకారంతో ఈ రాళ్లను సేకరించి ఆయా గ్రామాలకు అవసరమైన మేరకు పంపుతారు. వీటిని ఆయా గ్రామాల్లో సచివాలయాల వద్ద భద్రపరిచేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేశారు.

‘ఎ’ క్లాస్‌ రాళ్లు 
మూడు గ్రామాలు కలిసే సరిహద్దుల్లో (ట్రై జంక్షన్లలో) వీటిని నాటుతారు. పెద్ద పరిమాణంలో ఉండే ఈ రాళ్లను ‘ఎ’ క్లాస్‌ రాళ్లు అంటారు. ఇవి ఎక్కువ ఎత్తు ఉండటంవల్ల దూరం నుంచే కనిపిస్తాయి. వీటికి సర్వే సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ ఆమోదించిన డిజైన్‌ ప్రకారం పైన రోలు లాగా చిన్న గుంత ఉంటుంది. రాష్ట్రమంతా ఈ రాళ్లు ఒకే ఎత్తు, వెడల్పు, డిజైన్‌లో ఉంటాయి.

‘బి’ క్లాస్‌ రాళ్లు
కొద్దిగా చిన్న పరిమాణంలో ఉండే వీటిని ‘బి’ క్లాస్‌ రాళ్లు అంటారు. సర్వే నంబర్లకు సరిహద్దులుగా ఈ రాళ్లను నాటుతారు. సర్వే సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ ఆమోదించిన డిజైన్ల ప్రకారం వీటికి ఒకవైపు బాణం కోణంలో గుర్తు ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *