స్థానిక ఎన్నికలను వాయిదా వేయండి

గుంటూరు  : ప్రజలు కరోనాతో ఇబ్బంది పడుతున్న తరుణంలో.. స్థానిక ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. చంద్రశేఖరరెడ్డి అన్నారు. ప్రభుత్వ సలహా తీసుకోకుండా.. ఉద్యోగుల్ని సంప్రదించకుండా విడుదల చేసిన షెడ్యూల్‌ను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ను డిమాండ్‌ చేశారు. ఆదివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా సెకండ్‌వేవ్, బర్డ్‌ ఫ్లూ భయాందోళనల్లో ప్రజలున్నారని.. ఇలాంటి సమయంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఉద్యోగుల ప్రాణాలు ముఖ్యమని.. కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ మొండిగా వ్యవహరిస్తే.. ఎన్నికలను బహిష్కరించి కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. తాము ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదని.. ఉద్యోగుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. కాగా, సీపీఎస్‌ రద్దుకు సీఎం జగన్‌ కట్టుబడి ఉన్నారని చంద్రశేఖరరెడ్డి చెప్పారు. కరోనా వల్ల రెవెన్యూ తగ్గి ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో సీపీఎస్‌ రద్దుతో పాటు పీఆర్సీ విషయంలో జాప్యం జరిగిందన్నారు. త్వరలోనే అవి పరిష్కారమవుతాయని వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై త్వరలో నిర్ణయం వెలువడే అవకాశముందన్నారు. సమావేశంలో ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ మినిస్టీరియల్‌ రాష్ట్ర అధ్యక్షుడు బండి చంద్రశేఖరరావు, ఏపీఎన్జీవో రాష్ట్ర ప్రచార కార్యదర్శి వి.కృపావరం, రాష్ట్ర కోశాధికారి ఎం.వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎ.రంగారావు, నాయకులు ఘంటసాల శ్రీనివాసరావు, సీహెచ్‌.రాంబాబు, ఎం.ఎన్‌.మూర్తి,  కె.ఎన్‌.సుకుమార్, సీహెచ్‌.అనిల్, జానీ బాషా తదితరులు పాల్గొన్నారు.

వేసవిలో నిర్వహించాలి: వైఎస్సార్‌ టీఎఫ్‌ 
అమరావతి : రాష్ట్రంలో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వేసవి సెలవుల్లో నిర్వహించాలని వైఎస్సార్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే జాలిరెడ్డి, జి సుదీర్‌ ఓ ప్రకటనలో కోరారు. కరోనాతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు భయాందోళనతో ఉన్నారని తెలిపారు. ఈ సమయంలో ఎన్నికల విధులు నిర్వహించేందుకు భయపడుతున్నారని, ముందుగా వారికి వ్యాక్సిన్‌ అందించాలని పేర్కొన్నారు. ఆ తర్వాత వేసవి సెలవుల్లో ఎన్నికలు నిర్వహించాలని, లేనిపక్షంలో ఎన్నికల విధులు బహిష్కరించడానికి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *