టీమిండియాకే కాదు.. మాకూ ఉన్నారు: క్యారీ

మెల్‌బోర్న్‌: త్వరలో టీమిండియాతో జరగబోయే ద్వైపాక్షిక సిరీస్‌ రసవత్తరంగా సాగడం ఖాయమని ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ పేర్కొన్నాడు. ఇరుజట్లలో కీలక ఆటగాళ్లు ఉండటంతో పోరు ఆసక్తికరమేనని అభిప్రాయపడ్డాడు. మీడియా ఇంటరాక్షన్‌లో భాగంగా పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చాడు క్యారీ. ఈ క్రమంలోనే టీమిండియా జట్టులో బుమ్రా, షమీ వంటి టాప్‌ బౌలర్లను ఎలా ఎదుర్కొంటారు అనే ప్రశ్నకు క్యారీ బదులిస్తూ తమ జట్టులో కూడా స్టార్క్‌, కమిన్స్‌, హజిల్‌వుడ్‌ వంటి పేసర్లు ఉన్నారనే విషయాన్ని ప్రత్యర్థి గమనించాలన్నాడు. ‘బుమ్రా, షమీలు కీలక బౌలర్లు అనే విషయాన్ని మేము అర్థం చేసుకోగలం. అదే సమయంలో మా జట్టులో కూడా అదే తరహా క్వాలిటీ ఆటగాళ్లు ఉన్న విషయాన్ని గుర్తించాలి. బ్యాటింగ్‌లో డేవిడ్‌ వార్నర్‌, అరోన్‌ ఫించ్‌లు తమ జోరును చూపడానికి సిద్ధంగా ఉన్నారు. బుమ్రా, షమీ, జడేజా, చహల్‌ వంటి బౌలర్ల గురించి మేము కచ్చితంగా చర్చిస్తాం. వారిని ఎదుర్కోవడంపై తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. కమిన్స్‌, స్టార్క్‌ల దూకుడు చూడాలని ఆశగా ఎదురుచూస్తున్నా. హజిల్‌వుడ్‌ తనదైన రోజున ప్రత్యర్థికి చుక్కలు చూపెడతాడు.స్పిన్‌ విభాగంలో ఆడమ్‌ జంపా ఉన్నాడు. దాంతో సిరీస్‌కు మంచి మజా వస్తుంది’ అని క్యారీ తెలిపాడు. ఈనెల 27వ తేదీన ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ ఆరంభం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *