విద్యుత్‌ ఉద్యోగుల ఆందోళన విరమణ

అమరావతి: రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో కొంతకాలంగా చేస్తున్న ఆందోళనను విరమిస్తున్నట్టు విద్యుత్‌ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ (జేఏసీ) ప్రకటించింది. సంఘాల నేతలతో విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మంగళవారం చర్చలు జరిపారు. వారు లేవనెత్తిన ప్రతీ డిమాండ్‌పైనా సానుకూలంగా స్పందించారు. దీంతో సమ్మె విరమిస్తూ జేఏసీ నేతలు మంత్రి సమక్షంలో లిఖిత పూర్వకంగా తెలిపారు. జేఏసీ డిమాండ్లపై ప్రభుత్వ సానుకూల అంశాలను అధికారులు వెల్లడించారు.విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 30 వేల మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు విద్యుత్‌ సంస్థలే నేరుగా వేతనాలు చెల్లించేందుకు గల అవకాశాలను అధ్యయనం చేయనున్నారు. ఇందుకు ఈఆర్‌పీడీసీ సీఎండీ, ట్రాన్స్‌కో జేఎండీ నేతృత్వంలో వేయనున్న కమిటీ 60 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. 1999–2004 మధ్య నియమించిన విద్యుత్‌ ఉద్యోగులకు పెన్షన్‌ను సమీక్షించి, ప్రభుత్వానికి 30 రోజుల్లో నివేదిక ఇవ్వనున్నారు. పెండింగ్‌ డీఏలను ఫ్రీజింగ్‌ ఆర్డర్స్‌ తొలగిన తర్వాత చెల్లిస్తారు. నగదు రహిత వైద్యసేవల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ముందుకెళ్తారు. రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నుంచి ఏపీ జెన్‌కో పీపీఏ నిబంధనలకు అనుగుణంగా విద్యుత్‌ తీసుకుంటుంది. విద్యుత్‌ సంస్థల ప్రైవేటీకరణ ప్రతిపాదనేదీ లేదని చర్చల సందర్భంగా ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలకు 2019–20లో రూ.17,904 కోట్లు, బిల్లుల చెల్లింపునకు రూ.20,384 కోట్లు ఇచ్చిందని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. రూ.30 వేల కోట్లకుపైగా నష్టాల్లో ఉన్న సంస్థలను ప్రైవేటీకరించకుండా ఆపిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. విద్యుత్‌ రంగం పటిష్టానికి 7 వేల మంది లైన్‌మెన్లను, 172 మంది ఏఈలను నియమించామని తెలిపారు. ప్రైవేటీకరణ ఆలోచన లేదు కాబట్టే ఇవన్నీ చేశామని మంత్రి విద్యుత్‌ ఉద్యోగులకు స్పష్టం చేశారు. ఆందోళన సందర్భంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలన్న జేఏసీ డిమాండ్‌పైనా మంత్రి సానుకూలంగా స్పందించారు.చర్చల్లో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి, ట్రాన్స్‌కో జేఎండీలు శ్రీధర్‌ రెడ్డి, వెంకటేశ్వరరావు, సీపీడీసీఎల్‌ సీఎండీ పద్మా జనార్దన్‌ రెడ్డి, జేఏసీ నేతలు పి.చంద్రశేఖర్, ఎం.వాసుదేవరావు, సాయికృష్ణ, ఓసీ విద్యుత్‌ ఉద్యోగుల సంఘం కార్యదర్శి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *