గుడివాడ లేఅవుట్ లో రాష్ట్రంలోనే మోడల్ వైఎస్సార్ జగనన్న కాలనీ

 

– 181 ఎకరాల్లో 7 వేల మంది పేదలకు ఇళ్ళపట్టాలు
– 77 ఎకరాల్లో నిర్మాణ దశలో 8,912 టిడ్కో ఇళ్ళు
– మట్టి ఫిల్లింగ్ పనులు పూర్తిచేసిన మంత్రి కొడాలి నాని

గుడివాడ : గుడివాడ పట్టణంలోని పేదప్రజల కోసం రూరల్ మండలం మల్లాయిపాలెం పరిధిలోని లేఅవుట్ లో రాష్ట్రంలోనే మోడల్ వైఎస్సార్ జగనన్న కాలనీని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) నిర్మిస్తున్నారు. గుడివాడ శాసనసభ్యుడిగా 2004 వ సంవత్సరంలో తొలిసారి ఎన్నికైనపుడు 10 వేల మంది పేదలకు ఇళ్ళపట్టాలివ్వాలనే కలను నేడు మంత్రిగా కొడాలి నాని సాకారం చేసుకుంటున్నారు. మల్లాయిపాలెం లేఅవుట్లో మంత్రి కొడాలి నాని స్వయంగా టిప్పర్ ద్వారా మట్టి ఫిల్లింగ్ పనులను నిర్వహించడంతో పాటు లేఅవుట్ అభివృద్ధి పనులను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గుడివాడ పట్టణంలోని పేదప్రజల కోసం రెండు విడతలుగా 181 ఎకరాల భూములను కొనుగోలు చేశారు. ఈ భూముల్లో 7 వేల మంది పేదప్రజలకు ఇళ్ళపట్టాలను కేటాయించారు. ఈ భూములకు సమీపంలో ఉన్న 77 ఎకరాలను 2008 వ సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సేకరించారు. ఇక్కడ చేపట్టిన 8,912 టిడ్కో గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో దాదాపు 4 వేల గృహాలను వచ్చే డిసెంబర్ నాటికి పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించనున్నారు. 7 వేల ఇళ్ళటాలను కేటాయించిన 181 ఎకరాల్లో లేఅవుట్ ను అన్ని వసతులతో అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, సీఎం జగన్మోహనరెడ్డిల సహకారం వల్ల 258 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ జగనన్న కాలనీలో గుడివాడ పట్టణంలోని 16 వేల మంది పేదలకు ఇళ్ళపట్టాలను కేటాయించడంతో పాటు ఇళ్ళు నిర్మించడం జరుగుతుందన్నారు. మల్లాయిపాలెం లేఅవుట్లో మట్టి ఫిల్లింగ్ పనులను పూర్తిచేశామని తెలిపారు. రాష్ట్రంలో రెండు దశల్లో పేదల కోసం రూ. 50 వేల 944 కోట్లతో 28 లక్షల 30 వేల 277 పక్కా ఇళ్ళను ప్రభుత్వం నిర్మించనుందని చెప్పారు. 2022 జూన్ నాటికి 15. 60 లక్షల ఇళ్ళనిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 2023 జూన్ నాటికి మిగతా 12.70 లక్షల ఇళ్ళ నిర్మాణాలు పూర్తవుతాయన్నారు. దీంతో రాష్ట్రంలో 17 వేల 005 వైఎస్సార్ జగనన్న కాలనీలు (ఊళ్ళు) రానున్నాయని చెప్పారు. ఈ కాలనీల్లో మౌలిక వసతుల కోసం ప్రభుత్వం రూ. 32 వేల 909 కోట్లను ఖర్చు చేస్తోందన్నారు. అక్క చెల్లెమ్మల పేరు మీద ఇళ్ళపట్టాలను ప్రభుత్వం పంపిణీ చేసిందని తెలిపారు. ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం, మౌలిక వసతుల ఖర్చుతో కలిపి ఒక్కొక్కరికీ ప్రాంతాన్ని బట్టి రూ. 5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. కాగా జగనన్న కాలనీలకు ఉచితంగా ఇసుకను ప్రభుత్వం అందించనుందని తెలిపారు. ఇందు కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా కూపన్లను సిద్ధం చేయడం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక కొరత లేకుండా అన్ని రీచ్ ల నుండి ఇసుక తవ్వకాలు, స్టాక్ పాయింట్ ఏర్పాటును ఎప్పటికపుడు పర్యవేక్షించాలని మైనింగ్ అధికారులను ఆదేశించామని మంత్రి కొడాలి నాని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *