• బిజినెస్ మేన్ నితిన్ రాజును పెళ్లాడిన ప్రణీత
  • కరోనా కారణంగా వేడుకకు కొద్ది మంది హాజరు
  • కరోనా సమయంలో పేదల ఆకలి తీర్చిన ప్రణీత

పదహారణాల తెలుగు అమ్మాయిలా కనిపించే హీరోయిన్లు మనకు చాలా అరుదుగా ఉంటారు. అందులో ఒకరు ప్రణీత. కన్నడ రాష్ట్రానికి చెందిన అమ్మాయి అయినా… అచ్చ తెలుగు అమ్మాయిలా ఆమె తెలుగు సినీ అభిమానుల మనసులను దోచుకుంది. తెలుగులో పలు చిత్రాలలో నటించిన ఆమె… మన ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ సినిమా ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఆమె పాత్ర ప్రేక్షకులను బాగా అలరించింది. ఒక నటిగానే కాకుండా ప్రణీత… ఒక మనసున్న మనిషిగా ఎంతో సామాజిక సేవ చేశారు. కరోనా ఫస్ట్ వేస్ నుంచి ఆమె అభాగ్యుల కోసం తన వంతు సాయం చేశారు. స్వయంగా ఆహారాన్ని తయారు చేస్తూ, ఎందరో నిరుపేదల ఆకలిని ఆమె తీర్చారు.అటువంటి టాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రణీత ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును ఆమె పెళ్లాడారు. కరోనా నేపథ్యంలో ఆమె వివాహానికి కేవలం కుటుంబసభ్యులు, అతికొద్ది మంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం ఆమె వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు. ఆమెకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.